

గాంధీ భవన్లో కాంగ్రెస్ మహిళా నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్, కొండా సుష్మిత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘సుష్మితా.. మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరించిన ఆమె, రాజకీయాల్లో పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ప్రస్తుత ఎమ్మెల్యేల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే తప్పేముందని ప్రశ్నించారు. కొండా సురేఖ తమ అక్క కావడంతో ఆ బంధాన్ని గౌరవిస్తూనే, సుష్మితకు కూడా కుటుంబ సభ్యురాలిగా మర్యాద ఇస్తున్నామని చెప్పారు. అయితే సుష్మిత కాంగ్రెస్లో కొనసాగుతున్నారా లేదా అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
సినిమాల్లో కనిపించే డైలాగులు రాజకీయాల్లో పనిచేయవని ఇందిరా శోభన్ వ్యాఖ్యానించారు. సుష్మిత వ్యాఖ్యల వెనుక ఇతర రాజకీయ పార్టీల నేతల ప్రోత్సాహం ఉందా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎవరి వద్దైనా అవినీతి లేదా అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థలకు అందించాలని, బహిరంగంగా బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు పదవులు దక్కేలా ప్రయత్నించాలి తప్ప, వ్యక్తిగత రాజకీయ ఆశయాల కోసం వివాదాలకు దారితీయవద్దని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే ముందు రాజకీయ పరిపక్వతతో వ్యవహరించాలని హితవు పలికారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!