

2029 లోక్‌సభ ఎన్నికల ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో తమిళనాడులో అధికార తమిళగ వెట్రి కజగం (TVK), కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయి. సీఎం సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ మంత్రులు.. 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే కేబినెట్ నుంచి తప్పుకుంటారని తమిళనాడు పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఎస్. రాజేష్ కుమార్ హెచ్చరించారు. 2029లో రాహుల్ గాంధీయే తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సమయంలో టీవీకే నేతలు, కార్యకర్తలు సీఎం సి. జోసెఫ్ విజయ్‌ను జాతీయ స్థాయిలో బలమైన నాయకుడిగా, 2029 ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. రాహుల్ గాంధీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేస్తుండగా, విజయ్ పేరును ముందుకు తీసుకురావడంపై టీవీకే వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. దీంతో టీవీకే–కాంగ్రెస్ భాగస్వామ్య భవిష్యత్తుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!