

మత్స్యకారుల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. ప్రతి రెండు మూడు నెలలకు మత్స్యకారుల బోట్లు ప్రమాదాలకు గురవుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆగస్టులో అంబేద్కర్, కోనసీమ బోట్లకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్న ఘటనను ఆయన ప్రస్తావించారు. సముద్రం మధ్యలో బోటు మరమ్మతుకు గురై బంగ్లాదేశ్ వైపు కొట్టుకుపోవడంతో మత్స్యకారులు 24 రోజుల పాటు నరకయాతన అనుభవించారని, చావుబతుకుల మధ్య గట్టెక్కారని తెలిపారు. శ్రీలంక, బంగ్లాదేశ్ ఎంబసీలకు సమాచారం అందించడంతో పాటు కోస్ట్‌గార్డ్ అధికారులతో సంప్రదింపులు జరిపామని చెప్పారు. చివరకు పశ్చిమ బెంగాల్ సమీపంలో మత్స్యకారులను గుర్తించి స్థానిక మత్స్యకారుల సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చినట్లు వెల్లడించారు.
మత్స్యకారులకు ఇప్పటివరకు సరైన సేఫ్టీ ఆడిట్ ఎందుకు నిర్వహించలేదని గురుమూర్తి ప్రశ్నించారు. మత్స్యకారులకు శాటిలైట్ ఫోన్లు, బోట్లకు నావిగేషన్ సదుపాయాలు, పవర్ బ్యాకప్ ఎందుకు కల్పించలేదని నిలదీశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో పట్టుబడుతున్న మత్స్యకారుల్లో ఏపీకి చెందినవారే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. మత్స్యకారులకు సముద్ర భద్రతపై సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బోట్లకు నావిగేషన్, పవర్ బ్యాకప్‌తో పాటు మత్స్యకారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. వైఎస్ జగన్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం స్పందించిందని, ఇందుకు కేంద్రానికి ధన్యవాదాలు చెబుతున్నామని గురుమూర్తి తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో మత్స్యకారుల కోసం అనేక ఏర్పాట్లు చేశామని, కొత్త బోట్లు అందించాలని నిర్ణయించినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా అమలు కాలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల సమస్యలను గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!