

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ఎకరాలకు పైగా భూమిని నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు భూములు ఎలా బదిలీ అవుతున్నాయో తాము ఇప్పటికే వివరించామని, దీనిపై ఆధారాలు చూపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరిన నేపథ్యంలో అసెంబ్లీలో దాదాపు రెండు గంటలు ఆయన కోసం ఎదురుచూశానని చెప్పారు. అయితే మంత్రి రాలేదని, సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో ఎంత భూమి 22ఏ జాబితాలో ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత భూమిని అందులో చేర్చారో వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో కుట్ర ఉందని చెబుతున్నారని, అయితే ఆ కుట్రకు బాధ్యులు ఎవరో ప్రజలకు వెల్లడించాలని అన్నారు. ధరణి పోర్టల్‌లో అవకతవకలపై గతంలో విచారణకు ఆదేశిస్తామని చెప్పారని, ఆ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. 22ఏ భూముల అంశంపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.15 వేల కోట్ల బదలాయింపుల ఆరోపణలపై హౌస్ కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని, అప్పటివరకు ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తున్నట్లు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!