

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమానికి తమ ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని సీఎం ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్ కె. కేశవరావు (కేకే) చైర్మన్‌గా ఏర్పాటైన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ప్రతినిధి బృందం శనివారం సీఎంతో భేటీ అయింది. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, కమిటీ సభ్యులు మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములునాయక్ పాల్గొన్నారు. ఉద్యమకారులు, జేఏసీలు, ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు, మహిళా ఉద్యమకారులతో నిర్వహించిన సంప్రదింపుల సారాంశంతో పాటు వర్గీకరణ ముసాయిదాతో కూడిన నివేదికను కమిటీ సీఎంకు అందజేసింది.
నివేదికను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యమకారుల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం, వారి కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడం ప్రజా ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. 250 గజాల నివాస స్థలాలు, ఆసరా తరహా పెన్షన్లు, హెల్త్‌కార్డులు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యోగులకు గౌరవ గుర్తింపు వంటి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ పోర్టల్ ఏర్పాటు చేసి డిజిటల్ దరఖాస్తులు స్వీకరించాలని, జిల్లాల వారీగా సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!