

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైకాపా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూటమి నాయకులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ కేసులకు భయపడేవాడు ఇక్కడ లేరు. నన్ను ఏమీ చేయలేరు’’ అంటూ హెచ్చరించారు. కోరుకొండ మండలం బుచ్చెంపేటలో వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి అనపర్తి మణికంఠ ఏకగ్రీవానికి అంగీకరించడంతో రాజా ఆయనపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి రాజాతో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన రాజా.. మణికంఠ తనకు చెప్పకుండా వైకాపాకు, పార్టీ కార్యకర్తలకు ద్రోహం చేశాడనే కోపంతో క్షణికావేశంలో తొందరపడ్డానని అంగీకరించారు. జరిగిన తప్పును సరిదిద్దుకుంటానని పేర్కొన్నారు.
బుచ్చెంపేటలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సి ఉండగా, అభ్యర్థి స్థానాన్ని వేలం వేసిన వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని జక్కంపూడి రాజా ప్రశ్నించారు. తమ నాయకుడు వైఎస్ జగన్ మాట తమ కుటుంబానికి శిరోధార్యమని, ఆయన ఆదేశిస్తే ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటానని అన్నారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అంగీకరించవద్దని జగన్ ఆరు నెలల ముందే సూచించారని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో వేలం ద్వారా ఎంపీటీసీ స్థానాన్ని తెదేపాకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో స్థానిక రాజకీయాల్లో ఏకగ్రీవ ఎన్నికల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!