

పేపర్ లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ప్రభుత్వం, పేపర్ లీక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక బిల్లును శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదానికి సిద్ధం చేస్తామని తెలిపారు. అనంతరం బిల్లును త్వరలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టంగా తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి విడుదల చేసిన ప్రత్యేక వీడియో సందేశంలో ప్రధాని ఈ వివరాలను వెల్లడించారు.
పేపర్ లీక్ ఘటనలు లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలను తీవ్రంగా కలవరపరిచాయని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపామని, విద్యార్థుల విద్యా సంవత్సరం దెబ్బతినకుండా వెంటనే పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అయితే అంతటితో ప్రభుత్వం ఆగదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కఠిన చట్టాలు, వేగవంతమైన న్యాయ ప్రక్రియ వంటి చర్యలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!