

మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ముంబయి వీధుల్లో భిక్షగాడి వేషంలో కనిపించడంతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. ఘాట్కోపర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పరాగ్ షా ఎమ్మెల్యేగా ఉండటంతో పాటు వ్యాపారవేత్తగా కూడా ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.3,300 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అలాంటి వ్యక్తి వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించడంతో పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే చర్చ కూడా మొదలైంది.
అయితే పరాగ్ షా భిక్షగాడిగా మారడానికి ఆర్థిక పరిస్థితులు కారణం కాదు. తన ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు జైన సంప్రదాయంలోని ప్రత్యేక మాసంలో భాగంగా ఆయన ఒకరోజు ఆధ్యాత్మిక దీక్ష చేపట్టారు. ఎవరూ గుర్తుపట్టకుండా వేషం మార్చుకున్న ఆయన తన నియోజకవర్గంలోని వీధుల్లో రోజంతా తిరుగుతూ భిక్ష స్వీకరించారు. దొరికిన ఆహారాన్ని తిని, రోడ్డు పక్కనే నిద్రించారు. ఈ అనుభవం తనకు జీవితంపై కొత్త అవగాహన కల్పించిందని పరాగ్ షా తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రజలను కలిసినప్పుడు తనకు లభించే గౌరవం ఒకలా ఉంటుందని, అదే వ్యక్తుల వద్దకు భిక్షగాడిగా వెళ్లినప్పుడు వారు తనకంటే ఉన్నతంగా కనిపించారని చెప్పారు. ఈ అనుభవం ద్వారా ముంబయి ప్రజల్లోని సహాయ గుణాన్ని కూడా తెలుసుకున్నానని ఆయన పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!