

సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు, కంటెంట్ వివరాలను నేరుగా భారత దర్యాప్తు సంస్థలకు రిపోర్ట్ చేసేందుకు మెటా అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఆన్‌లైన్ వేదికల్లో మైనర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న కేంద్రం.. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పిల్లలను హానికర కంటెంట్ నుంచి రక్షించాల్సిన బాధ్యత ఆయా ప్లాట్‌ఫామ్‌లదేనని కేంద్రం పునరుద్ఘాటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను గుర్తించి తొలగించే అంశంపై కేంద్రం సోషల్ మీడియా సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. భారత్‌లోని మెటా ప్రతినిధులకు ఈ అంశంపై కేంద్రం గతంలో నోటీసులు జారీ చేసి.. సంస్థ ఉపయోగిస్తున్న అల్గారిథమ్స్, కంటెంట్ నియంత్రణ వ్యవస్థలు, డీప్‌ఫేక్ కంటెంట్‌ను అరికట్టే విధానాలు, భారత చట్టాలకు అనుగుణంగా తీసుకుంటున్న చర్యలపై వివరాలు కోరింది. ఇప్పటివరకు ఇలాంటి కంటెంట్ వివరాలను మెటా అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (NCMEC)కు నివేదించేది. అనంతరం NCMEC ఆ సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్యాప్తు సంస్థలతో పంచుకునేది. ఆ ప్రక్రియ ద్వారా భారత దర్యాప్తు సంస్థలకు వివరాలు చేరేవి. అయితే ఇకపై మధ్యవర్తి సంస్థ ప్రమేయం లేకుండా మెటానే నేరుగా భారత దర్యాప్తు సంస్థలకు ఇలాంటి సమాచారాన్ని రిపోర్ట్ చేయనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!