

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తన పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిలపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన దాడిపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఉదయం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన పోలీసులు రాత్రి వరకు ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసి దాడికి కుట్ర పన్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లోకి సుమారు 15 మంది చొరబడి విచారణకు హాజరైన వారిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా పేర్కొంటూ, ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పీఆర్వో, పీఏలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించినప్పటికీ రాజకీయ కక్షతోనే దాడి జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లోపల, వెలుపల ఉన్న సీసీటీవీ దృశ్యాలను వెంటనే భద్రపరచాలని కోరారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, గాయపడిన మహేష్, మహేందర్ రెడ్డికి తక్షణ రక్షణ కల్పించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ నేతల నిరసనల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో వారిద్దరినీ విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!