

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో నిర్వహించిన బాయిబాట కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అడవుల్లో మావోయిస్టులు ఉన్న సమయంలో సింగరేణి అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసేవారని, ఇప్పుడు ప్రశ్నించే వారు లేరనే భావన యాజమాన్యంలో ఉందని ఆరోపించారు. కార్మికులను ఇబ్బంది పెడితే సహించబోమని హెచ్చరిస్తూ, మావోయిస్టు నేపథ్యంలోని వ్యక్తులు ఇప్పుడు తమతో ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఆర్కే-7 భూగర్భ గని వద్ద కార్మికులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన కవితను సిబ్బంది అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆమె కార్మికుల సమస్యలపై స్పందిస్తూ లాభాల పంపిణీలో కార్మికులకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. మహిళా ఉద్యోగులకు సరైన సౌకర్యాలు కల్పించాలని, భూగర్భ గనుల విస్తరణపై దృష్టి పెట్టాలని, ఉద్యోగాల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల అజ్ఞాత జీవితం వీడి ప్రజాజీవితంలోకి వచ్చిన మాజీ మావోయిస్టు నాయకుడు దేవ్ జీని ఆమె పరామర్శించడం కూడా ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. మాజీ మావోయిస్టు నేతలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలపై ప్రచారం జరుగుతున్న వేళ కవిత వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!