

గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపి పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడంతో పాటు, సీనియర్ న్యాయవాదుల సహకారంతో సుప్రీంకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించారని, అందుకే అనుకూల తీర్పు వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరుతాయని తెలిపారు.
మరోవైపు తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల (నివారణ) బిల్లు-2026పై సెలెక్ట్ కమిటీ త్వరలోనే శాసనసభకు నివేదిక అందజేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం శాసనసభ స్పీకర్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, కమిటీ సభ్యులు, శాసనసభ, మండలి అధికారులు పాల్గొని బిల్లుపై చర్చించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!