

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కీలక ముందడుగు వేసింది. నాలుగు జట్లతో మహిళా ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)ను నిర్వహించనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఈ లీగ్ జరగనుంది. ఏసీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేశినేని చిన్ని, భారత మహిళల మాజీ కెప్టెన్, ఏసీఏ మహిళల జట్టు మెంటార్ మిథాలీ రాజ్, ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ లీగ్ వివరాలను వెల్లడించారు. బిడ్డింగ్ విధానం ద్వారా నాలుగు ఫ్రాంచైజీలను ఇప్పటికే ఖరారు చేసినట్లు కేశినేని చిన్ని తెలిపారు. లీగ్‌లో పాల్గొనే క్రీడాకారిణుల వేలం కోసం 200 మందికిపైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.
ఏసీఏ మహిళా ప్రీమియర్ లీగ్ సంస్థకు కీలక మైలురాయిగా నిలుస్తుందని మిథాలీ రాజ్ అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఈ లీగ్ మంచి వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు పోటీ క్రికెట్‌లో మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం నాలుగు జట్లతో ప్రారంభిస్తున్న ఎంపీఎల్‌ను భవిష్యత్‌లో మరిన్ని ఫ్రాంచైజీలకు విస్తరిస్తామని కళ్యాణ్ కృష్ణ తెలిపారు. కొత్త లీగ్ ద్వారా రాష్ట్రంలో మహిళా క్రికెట్‌కు బలమైన వ్యవస్థ ఏర్పడటంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు లభిస్తాయని ఏసీఏ భావిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!