

తదుపరి ఐపీఎల్ సీజన్‌కు ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీలో మార్పు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త సారథిని ఎంపిక చేయడంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. మళ్లీ కెప్టెన్సీ చేపట్టాలని ముంబయి యాజమాన్యం కోరినప్పటికీ రోహిత్ అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే వ్యూహ బృందంలో రోహిత్‌ను భాగస్వామిగా చేసినట్లు సమాచారం. మూడేళ్ల క్రితం రోహిత్‌ను తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. అయినప్పటికీ రోహిత్ ముంబయితోనే కొనసాగుతూ ఆటగాడిగా తన సేవలు అందిస్తున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో జట్టు ప్రదర్శనపై విమర్శలు రావడంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
హార్దిక్ పాండ్యా ఇతర ఫ్రాంఛైజీలకు వెళ్లే అవకాశాలపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు అతడిపై ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చినా.. ట్రేడ్ విషయంలో విలువ, ప్రత్యామ్నాయ ఆటగాడి ఎంపిక వంటి అంశాలు అడ్డంకిగా మారుతున్నట్లు తెలుస్తోంది. దీంతో హార్దిక్ మరో సీజన్ ముంబయితోనే ఆటగాడిగా కొనసాగినా ఆశ్చర్యం లేదని ఐపీఎల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త కెప్టెన్ కోసం మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ, ఫాస్ట్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా పేర్లను ముంబయి పరిశీలిస్తున్నట్లు సమాచారం. సూర్యకుమార్ యాదవ్‌ను మాత్రం వయసు, ఇటీవలి ఫామ్ కారణంగా కెప్టెన్సీ రేసులో పరిగణించడం లేదని తెలుస్తోంది. అయితే అతడిని జట్టులో కొనసాగించే అవకాశాలున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!