

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో కీలకమైన రెండు టెస్టుల సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంకలోని కొలంబోకు చేరుకుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్ మినహా మిగతా 14 మంది ఆటగాళ్లు జట్టుతో కలిసి ప్రయాణించారు. తొలి టెస్టు ఈ నెల 15 నుంచి గాలేలో, రెండో టెస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది. అంతకుముందు ఆగస్టు 7 నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ బరిలోకి దిగనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో 48.15 పాయింట్ల శాతంతో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఈ సిరీస్‌లో విజయాలు సాధిస్తే ఫైనల్ రేసులో భారత అవకాశాలు మరింత బలపడనున్నాయి.
సాయి సుదర్శన్ ఇంకా పూర్తిస్థాయిలో గాయం నుంచి కోలుకోకపోవడంతో జట్టుతో కలిసి శ్రీలంకకు వెళ్లలేదు. బీసీసీఐ వైద్య బృందం అతని ఫిట్‌నెస్‌ను పరిశీలిస్తుండగా, త్వరలోనే కోలుకుంటే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌కు చెందిన టి. దిలీప్ స్థానంలో అస్సాంకు చెందిన శుభదీప్ ఘోష్‌ను భారత జట్టు కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. భారత మహిళల జట్టు, ఇండియా ‘ఏ’, అస్సాం జట్టుతో పనిచేసిన అనుభవం ఉన్న శుభదీప్ ఈ సిరీస్‌తో బాధ్యతలు చేపట్టనున్నారు. టి. దిలీప్, మాజీ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే సేవలకు బీసీసీఐ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!