

2026 ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్లకు సంబంధించిన ఓ అంశంపై చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో పురుషుల, మహిళల భారత జట్లు ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించేందుకు నిరాకరించాయి. దీంతో ఆసియా క్రీడల్లో భారత జట్లు పతకాలు గెలిస్తే, నఖ్వీ వాటిని అందించే పరిస్థితి వస్తే ఏం జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తాయి.
ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా నిబంధనల ప్రకారం ఓసీఏ అధ్యక్షుడు పతకాలను అందించవచ్చు. అవసరమైతే ఈ బాధ్యతను మరో ఓసీఏ సభ్యుడికి అప్పగించే అధికారం కూడా ఆయనకు ఉంది. అలాగే విజయోత్సవ కార్యక్రమాల్లో రాజకీయ లేదా ఇతర ప్రచారాలకు అనుమతి లేదని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ అంశంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ప్రస్తుతం జట్లు మ్యాచ్‌లపై మాత్రమే దృష్టి పెడుతున్నాయని, పతకాలు గెలిచి పోడియంపైకి చేరినప్పుడు అప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!