

ప్రపంచ కృత్రిమ మేధ రంగంలో భారత్ కీలక కేంద్రంగా ఎదుగుతోంది. ప్రపంచస్థాయి సామర్థ్య కేంద్రాల (జీసీసీలు) విస్తరణతో పాటు పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉండటం దేశానికి కలిసొస్తోంది. కేవలం సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, సహాయక సేవలకే పరిమితం కాకుండా.. ఏఐ ఆధారిత అనువర్తనాలు, నమూనా రూపకల్పన, చిప్ రూపకల్పన వంటి అధునాతన రంగాల్లోనూ భారత్ తన ప్రాధాన్యాన్ని పెంచుకుంటోంది. ప్రముఖ స్థిరాస్తి సేవల సంస్థ సీబీఆర్‌ఈ విడుదల చేసిన ‘ది పాలసీ అడ్వాంటేజ్–పవరింగ్ ఇండియాస్ జీసీసీ గ్రోత్’ నివేదిక ప్రకారం.. ఏఐ ఉద్యోగాల కల్పనలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. దేశంలో 1,200కు పైగా జీసీసీలు కృత్రిమ మేధ, యంత్ర అభ్యసన సేవలను అందిస్తుండగా.. 250కు పైగా కేంద్రాలు పరిశోధన, ఆవిష్కరణల కోసం అత్యుత్తమ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేశాయి. వీటిలో 2.5 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన నిపుణులు పనిచేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 23.6 లక్షల జీసీసీ ఉద్యోగాల్లో దాదాపు 94 శాతం ఆరు ప్రధాన నగరాల్లోనే ఉన్నాయి. బెంగళూరు 34 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా.. హైదరాబాద్ 14 శాతంతో రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో సమాచార సాంకేతికత, జీవశాస్త్రాలు, ఇంజినీరింగ్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో జీసీసీ ఉద్యోగాలు విస్తరిస్తున్నాయి. పుణె 13 శాతం, చెన్నై 12 శాతం, ముంబయి 11 శాతం, దిల్లీ 10 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2031 నాటికి దేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు, 1,300కు పైగా కొత్త జీసీసీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే భారతీయ కృత్రిమ మేధ నిపుణుల్లో సీనియర్ స్థాయి నిపుణుల వాటా ప్రస్తుతం 19 శాతం మాత్రమే. దీంతో అధునాతన పరిశోధనలు, ఉన్నతస్థాయి నాయకత్వ బాధ్యతలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం రానున్న రోజుల్లో దేశీయ సాంకేతిక రంగానికి కీలక సవాలుగా మారనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!