

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో బుధవారం భారీ తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు మేలిమి బంగారం ధర సుమారు 150 డాలర్లు తగ్గి 4,110 డాలర్లకు చేరింది. దీనికి అనుగుణంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹1,50,400కు పడిపోయింది. వెండి ధర కూడా కిలోకు ₹2,42,000కు చేరింది. ఒక్కరోజులోనే బంగారం ధర ₹6,000కుపైగా, వెండి ధర ₹9,500 వరకు తగ్గడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇరాన్–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ధరల్లో మరింత మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
అమెరికా డాలర్ బలపడటం, ముడి చమురు ధరలు పెరగడం, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చన్న అంచనాలు బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. మార్చితో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర గణనీయంగా తగ్గింది. దేశీయంగా బంగారం, వెండి దిగుమతులపై సుంకాలు 6 శాతం నుంచి 15 శాతానికి పెరగడం వల్ల ధరలు ఇంకా అధికంగానే ఉన్నాయి. ఇదే సమయంలో బిల్లు లేని బంగారం విక్రయాలు పెరుగుతున్నాయని, అధికారిక ఆభరణాల విక్రయాలు మందగిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!