

అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పులులు కేవలం దేశ జాతీయ జంతువు మాత్రమే కాకుండా జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యత, అటవీ సంపదకు ప్రతీక అని పేర్కొన్నారు. పులుల సంరక్షణ అంటే అడవులు, జల వనరులు, వన్యప్రాణులు, భావితరాలకు అందించాల్సిన సహజ వారసత్వాన్ని కాపాడుకోవడమేనని తెలిపారు. 'ప్రాజెక్ట్ టైగర్' విజయంతో ప్రపంచంలోని దాదాపు 75 శాతం పులులు భారతదేశంలోనే నివసిస్తున్నాయని గుర్తుచేశారు. దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం గర్వకారణమని పేర్కొంటూ, తాజా లెక్కల ప్రకారం ఎన్‌ఎస్‌టీఆర్–శేషాచలం పరిధిలో 68 పులులు, 11 పులి పిల్లలు నమోదయ్యాయని వెల్లడించారు.
పులుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయ విధానాలను అమలు చేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. వేట నిరోధక చర్యల బలోపేతం, గడ్డి మైదానాల అభివృద్ధి, వేట జంతువుల సంఖ్య పెంపు, డ్రోన్లు, కెమెరా ట్రాప్‌లు, ఆధునిక నిఘా వ్యవస్థల వినియోగంతో అటవీ రక్షణను మరింత సమర్థవంతంగా చేపడుతున్నామని చెప్పారు. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో వేట నిరోధక శిబిరాలను 89 నుంచి 150కు పెంచడంతో పాటు దాదాపు 800 మంది గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. తూర్పు కనుమల్లో పులుల జన్యు వైవిధ్యాన్ని పెంపొందించేందుకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి నాలుగు ఆడ పులులను తీసుకురావడానికి సహకరించిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నల్లమల అడవుల్లో పులి గర్జన శాశ్వతంగా వినిపించేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!