

‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్‌ఎఫ్‌ఎం) 2026లో ప్రతిష్టాత్మక ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఆగస్టు 13న మెల్‌బోర్న్‌లో నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేసిన కథలను తెరకెక్కించినందుకు ఈ గౌరవం ఆయనకు లభించింది.
ఈ అవార్డు ఎంపికపై స్పందించిన రిషబ్ శెట్టి, ఇది తన సినీ ప్రయాణంలో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపుగా భావిస్తున్నట్లు తెలిపారు. భారతీయ మూలాలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కథలను ప్రపంచానికి పరిచయం చేయడం తనకు ఎప్పుడూ ప్రాధాన్యమని చెప్పారు. అలాంటి కథలు అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మెల్‌బోర్న్‌లో జరిగే వేడుకలో సినీ ప్రముఖులు, ప్రేక్షకులతో కలిసి పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!