

అపార సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఎలన్ మస్క్ ప్రపంచ తొలి ట్రిలియన్ డాలర్ల సంపద కలిగిన వ్యక్తిగా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఆయన నికర ఆస్తుల విలువ ఇప్పటికే సుమారు రూ.75 లక్షల కోట్లు దాటింది. ఆయనకు చెందిన అంతరిక్ష సాంకేతిక సంస్థలో 50 శాతానికి పైగా వాటా ఉండగా, సంస్థ విలువ పెరిగితే ఆయన సంపద 1.11 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మస్క్ సంపద ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాల వార్షిక స్థూల దేశీయోత్పత్తికంటే ఎక్కువగా ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ల సంపదలను కలిపితేనే ట్రిలియన్ డాలర్ల స్థాయిని దాటుతాయి. ప్రపంచంలో అత్యంత విలువైన 50 క్రీడా జట్ల మొత్తం విలువ 353 బిలియన్ డాలర్లు కాగా, అది కూడా మస్క్ అంచనా సంపద కంటే చాలా తక్కువ.
మరోవైపు భారత్లో సంతానోత్పత్తి రేటు తగ్గుతుండటంపై మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో దేశ సంతానోత్పత్తి రేటు 2.3 నుంచి 1.9కు పడిపోయిందని పేర్కొన్నారు. జనాభా సమతుల్యత కోసం అవసరమైన పునరుత్పత్తి స్థాయి 2.1 కాగా, ప్రస్తుతం అది దాని కంటే తక్కువగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రేటు 1.2గా నమోదైనట్లు ఆయన ప్రస్తావించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!