

సాయాజీ షిండే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు. ఠాగూర్, అతడు, పోకిరి, అరుంధతి, దుబాయ్ శీను వంటి చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. మరాఠీ నాటకాలతో కళారంగంలో అడుగుపెట్టిన ఆయన, అనంతరం పలు భాషల చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. తన గంభీర స్వరం, శక్తివంతమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించారు.
అయితే సాయాజీ షిండే సేవలు సినిమాలకే పరిమితం కాలేదు. 2016లో మహారాష్ట్రలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రకృతి సంరక్షణ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. పవిత్ర అరణ్యాల స్ఫూర్తితో “సహ్యాద్రి దేవరాయి” ఉద్యమాన్ని ప్రారంభించి, దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేసి మొక్కలను తెప్పించి నాటడం మొదలుపెట్టారు. 1978లో ఆనకట్ట నిర్మాణం కోసం వారి కుటుంబ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా, ప్రత్యామ్నాయ భూమి అందడానికి 35 సంవత్సరాలు పట్టిన అనుభవం కూడా ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది.
ప్రస్తుతం మహారాష్ట్రలో 48 ప్రాంతాల్లో చెట్ల పెంపక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇప్పటివరకు సుమారు ఆరున్నర లక్షల మొక్కలు నాటబడ్డాయి. మర్రి, వేప, రావి, మామిడి, నేరేడు, చింత వంటి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన సయాజీ షిండే, ప్రకృతి కోసం అంకితభావంతో పనిచేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!