

రిటైల్, ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటులో భారత్ ప్రపంచవ్యాప్తంగా కీలక కేంద్రంగా ఎదుగుతోందని టీమ్‌లీజ్ డిజిటల్ వెల్లడించింది. గత ఏడాది చివరి నాటికి దేశంలో 180 రిటైల్ జీసీసీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఇది పోలెండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, జర్మనీ, ఈజిప్టు దేశాల్లోని మొత్తం రిటైల్ జీసీసీల కంటే 34 శాతం ఎక్కువ అని పేర్కొంది. వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్, టార్గెట్, లోరియల్, ఏబీ ఇన్బెవ్, టెస్కో వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇప్పటికే భారత్‌లో తమ జీసీసీలను ఏర్పాటు చేశాయి.
అమెరికాతో పాటు యూరప్‌కు చెందిన అనేక రిటైల్ కంపెనీలు భారత్‌లో తమ జీసీసీలను విస్తరిస్తుండగా, జపాన్, దక్షిణ కొరియా కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ తెలిపారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల లభ్యత, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అనుకూల వ్యాపార విధానాలు, పన్ను రాయితీలు, తక్కువ మౌలిక సదుపాయాల ఖర్చులు ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని 180 జీసీసీల్లో 130 నానో జీసీసీలు ఉండగా, ఇవి బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, పుణె, హైదరాబాద్‌తో పాటు మంగళూరు వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో విస్తరిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!