

విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఏఐజీ హాస్పిటల్స్ భారీ ప్రాజెక్టును చేపడుతోంది. విశాఖలోని ఎండాడ ప్రాంతంలో ఏఐజీ హాస్పిటల్స్ నిర్మాణానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఏపీ ప్రజలు అత్యాధునిక వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.
ఏఐజీ హాస్పిటల్స్ ఈ ప్రాజెక్టులో దశలవారీగా ఐదేళ్లలో రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో సుమారు 9 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఆసుపత్రి సామర్థ్యం 1,000 పడకలకు చేరుకోనుంది. రోజుకు సుమారు 5 వేల మంది రోగులకు ఓపీడీ సేవలు అందించేలా దీనిని రూపొందిస్తున్నారు. 9 ఎకరాల్లో ఆసుపత్రి క్యాంపస్, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో 650 పడకల సామర్థ్యంతో టవర్ ఏ, టవర్ బి నిర్మాణాలను 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో మరో 350 పడకలతో టవర్ సి నిర్మించనున్నారు.
ఈ క్యాంపస్‌లో వైద్యం, శిక్షణ, పరిశోధనతో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని సదుపాయాలతో సమగ్ర ఆరోగ్య సేవల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 8 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలు, ప్రత్యేక మాతా శిశు విభాగం, నర్సింగ్ కళాశాల, హాస్టల్, పారామెడికల్ శిక్షణ కేంద్రం, 500 సీట్ల ఆడిటోరియం, పరిశోధన ప్రయోగశాల, ఏఐ కేంద్రం వంటి సదుపాయాలు ఉంటాయి. ఆసుపత్రి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సుమారు 1,000 మంది వైద్యులు సేవలందించనున్నారు. వైద్యరంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఏఐజీ హాస్పిటల్స్‌కు హైదరాబాద్‌లో మూడు యూనిట్లు, 1,400కు పైగా పడకలు, 350కి పైగా ఐసీయూ పడకలు, 600కు పైగా వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఉన్నారు. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా రోగులకు సేవలు అందించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!