

టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన భార్య మిర్కా ఫెదరర్ చేసిన భావోద్వేగ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2000 ఒలింపిక్స్ సమయంలో తొలిసారి కలిసిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మిర్కా.. టెన్నిస్ కోర్టులో ఫెదరర్ సాధించిన విజయాలకంటే కుటుంబం పట్ల ఆయన చూపిన ప్రేమ, నిబద్ధత, మానవీయ విలువలను ఎక్కువగా ప్రశంసించారు. తండ్రిగా, భర్తగా, కుమారుడిగా, స్నేహితుడిగా రోజర్ తన బాధ్యతలను ఎంతో అద్భుతంగా నిర్వర్తించారని చెప్పారు. ట్రోఫీలు, రికార్డులు గొప్పవే అయినప్పటికీ, ఎవరూ చూడనప్పుడు రోజర్ ఎలా ఉంటారన్నదే తనకు ఎక్కువ గర్వకారణమని మిర్కా పేర్కొన్నారు. ఆమె ప్రసంగంతో ఫెదరర్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
మిర్కా ప్రసంగం అనంతరం ఫెదరర్ మాట్లాడుతూ ఆమె అద్భుతంగా మాట్లాడిందని ప్రశంసించారు. హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడం తన జీవితంలోని అత్యుత్తమ ఘట్టాల్లో ఒకటని పేర్కొన్నారు. తనను ప్రేమించే వారి కోసం జీవితాంతం ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. టెన్నిస్ తన ప్రపంచమని, అయితే కేవలం కోర్టులో ఆడటమే కాకుండా జీవితంలో ఏదైనా కొత్తదాన్ని సృష్టించడం కూడా తన లక్ష్యమని తెలిపారు. మైదానం బయట మనం ఎలా ఉంటామన్నదీ అంతే ముఖ్యమని ఫెదరర్ పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!