

నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా ‘ఫిఫా వరల్డ్‌కప్-2026’ పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు సీబీఐ పేర్కొంది. గత ఏడాది నవంబరులో ఏర్పాటు చేసిన ఈ గ్రూప్‌లో ఎనిమిది మంది సభ్యులు ఉన్నట్లు తెలిపింది. నిందితులు పీవీ కులకర్ణి, మనీషా మంధారేలను విచారించిన సందర్భంగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చినట్లు సీబీఐ వెల్లడించింది. ఢిల్లీ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో ఈ అంశాలను పొందుపరిచింది.
సీబీఐ వివరాల ప్రకారం.. పుణెకు చెందిన మనీషా మంధారే ఈ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేయగా, పుణెకు చెందిన బ్యూటీషియన్ మనీషా వాఘ్మరే సమన్వయకర్తగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సబ్జెక్టు నిపుణులైన అధ్యాపకులతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బయాలజీ, కెమిస్ట్రీ, బోటనీ తరగతులు నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది. మరో నిందితుడైన ఫిజిక్స్ నిపుణుడిని వాఘ్మరే ఈ గ్రూప్‌లోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. మొత్తం 66 రాతపూర్వక ప్రశ్నలను విద్యార్థులకు లీక్ చేసినట్లు సీబీఐ ఆరోపించింది. లీకైన ప్రశ్నలను సబ్జెక్టుల వారీగా విభజించేందుకు పుణెలోని వాఘ్మరే భర్తకు చెందిన డెంటల్ క్లినిక్‌ను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!