

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పల్స్ ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన నానో-క్యారియర్ ఎన్‌ట్రాప్డ్ విటమిన్ డీ3 మౌఖిక ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి లభించినట్లు కంపెనీ ప్రకటించింది. కఠినమైన శాస్త్రీయ, వైద్యపరమైన పరీక్షల అనంతరం ఈ అనుమతి లభించిందని కంపెనీ వ్యవస్థాపకుడు, ఎండీ కేవీ రాంబాబు తెలిపారు. నానో సాంకేతికత ఆధారిత విటమిన్ డీ3 ఔషధానికి ఈ తరహా నియంత్రణ అనుమతి ప్రపంచంలోనే తొలిసారిగా లభించిందని ఆయన పేర్కొన్నారు.
వైద్యపరమైన పరీక్షల్లో ఈ ఔషధం వినియోగంతో రక్తంలోని విటమిన్ డీ3 స్థాయిలు 50–60 శాతం పెరిగినట్లు వెల్లడైందని రాంబాబు తెలిపారు. 2010 నుంచి ఈ ఔషధంపై పరిశోధనలు నిర్వహిస్తున్నామని, కంపెనీకి చెందిన ‘అక్వీల్’ సొంత సాంకేతిక వేదిక ద్వారా దీన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇదే సాంకేతికతతో విటమిన్ కే2-7, విటమిన్ బీ12, ఇనుము ఉత్పత్తులపై కూడా పనిచేస్తున్నట్లు తెలిపారు. రూర్కీ, బద్దీ, హైదరాబాద్‌లో తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్న కంపెనీ.. హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో రూ.150 కోట్ల పెట్టుబడితో కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!