

టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ ప్రస్తుత కాలంలో విడుదలవుతున్న సినిమాల తీరుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొన్ని సినిమాలు ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా ఉంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారులు ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లలో వివిధ రకాల కంటెంట్‌ను చూస్తున్నారని, అలాంటి సమయంలో చెడు ప్రభావం చూపించే సినిమాలు వారి ఆలోచనా విధానంపై మరింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సుమన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి చిత్రాలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతులు ఇస్తుందో కూడా ఆయన ప్రశ్నించారు.
సినిమా అనేది ప్రజల ఆలోచనలు, భావజాలాన్ని ప్రభావితం చేయగల శక్తివంతమైన మాధ్యమమని సుమన్ పేర్కొన్నారు. మంచి అలవాట్లు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, మానవ సంబంధాలను పెంపొందించేలా సినిమాలను ఉపయోగించుకోవచ్చని అన్నారు. నిర్మాతలు, దర్శకులు కేవలం వ్యాపార ప్రయోజనాలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే కథలను ఎంచుకుని ప్రేక్షకులకు మంచి సందేశాన్ని అందించే చిత్రాలను రూపొందించాలని ఆయన సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!