

బిహార్‌లోని నలంద జిల్లా హర్నౌత్‌కు చెందిన ఝండూ కుమార్ జీవితం సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. ఐదేళ్ల వయసులో పోలియో బారినపడటంతో రెండు కాళ్లు పనిచేయని స్థితికి చేరుకున్నా.. వైకల్యాన్ని తన లక్ష్యాలకు అడ్డంకిగా మారనివ్వలేదు. తొలుత షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పోటీపడిన ఝండూ.. శారీరక దారుఢ్యం పెంచుకునేందుకు జిమ్‌లో చేరి అక్కడే పారా పవర్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. మరోవైపు పేదరికంతో పోరాడుతూ కుటుంబ బాధ్యతలనూ భుజాన వేసుకున్నాడు. తండ్రి కూరగాయల వ్యాపారానికి సాయం చేస్తూ రోజూ దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చేవాడు. దుకాణం మూతపడిన సమయంలో అప్పు చేసి ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసి, దాన్ని నడుపుతూ కుటుంబాన్ని పోషించడంతో పాటు తన శిక్షణను కొనసాగించాడు.
ఝండూ క్రీడా ప్రయాణంలో వైఫల్యాలూ ఎదురయ్యాయి. 2023 జాతీయ పారా పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో ఒక్క లిఫ్ట్ కూడా పూర్తి చేయలేక చివరి స్థానంలో నిలిచాడు. అయితే అదే అతడి కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. కోచ్ రాజిందర్‌సింగ్ రహేలు అతడిలోని ప్రతిభను గుర్తించి గాంధీనగర్‌లోని సాయ్ కేంద్రంలో శిక్షణ ఇప్పించారు. అక్కడ టెక్నిక్‌ను మెరుగుపరుచుకున్న ఝండూ.. ఖేలో ఇండియా పోటీల్లో రజతం సాధించి, ఆ తర్వాత 206 కేజీల జాతీయ రికార్డుతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో 190 కేజీల ప్రదర్శనతో కాంస్య పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. పేదరికం, వైకల్యం తన కలలకు అడ్డుకాదని నిరూపిస్తూ ఝండూ కుమార్ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!