

పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథ స్వామివారి బహుడా (తిరుగు) రథయాత్ర శుక్రవారం అత్యంత వైభవంగా జరగనుంది. గుండిచా దేవి ఆలయంలో కొలువుదీరిన అనంతరం జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి తిరిగి శ్రీమందిరానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా పూరీ తూర్పు తీర దివ్యక్షేత్రం అంతా "హరిబోల్", "జై జగన్నాథ్" నినాదాలతో మార్మోగనుంది. తిరుగు ప్రయాణంలో బొడోదండ వద్ద ఉన్న మవుసిమా (పిన్ని) ఆలయం వద్ద నందిఘోష రథం ఆగడం శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం.
ఈ సందర్భంగా మవుసిమా ఆలయ సేవాయతులు ప్రత్యేకంగా సిద్ధం చేసిన సంప్రదాయ ప్రసాదం ‘పుడోపిఠా’ను జగన్నాథ స్వామికి సమర్పిస్తారు. అనంతరం రాజప్రసాదం సమీపంలో జరిగే లక్ష్మీనారాయణ భేట్ మరో ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది. రథయాత్రకు తనను వెంట తీసుకెళ్లలేదన్న అలకతో ఉన్న మహాలక్ష్మికి స్వామి తిరిగి శ్రీక్షేత్రానికి చేరుకున్న విషయాన్ని తెలియజేసే ప్రత్యేక ఆచారాలు నిర్వహిస్తారు. గజపతి మహారాజు స్వామికి పూజలు నిర్వహించి హారతి ఇవ్వగా, మహాలక్ష్మి అద్దంలో స్వామివారి ముఖారవిందాన్ని దర్శించిన అనంతరం ఆలయానికి తిరిగి చేరడం ఈ ఉత్సవంలోని విశిష్ట సంప్రదాయంగా భావిస్తారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!