

ప్రజారవాణా సేవలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో టీజీఎస్ ఆర్టీసీ, మీసేవ సహకారంతో ‘మీటికెట్’ (MeeTicket) పేరుతో వినూత్న డిజిటల్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఆటోలు, క్యాబ్‌లు వంటి ప్రధాన రవాణా సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. ప్రయాణికులు ఒకే యాప్ ద్వారా ఆర్టీసీ లేదా మెట్రో టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు, తమ గమ్యస్థానానికి చేరుకునేందుకు ఆటో లేదా క్యాబ్‌ను కూడా ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది.
‘మీటికెట్’ ద్వారా డిజిటల్ చెల్లింపులను కూడా సులభతరం చేయనున్నారు. ప్రయాణికులు చెల్లించిన మొత్తాన్ని సంబంధిత రవాణా విభాగాలు, భాగస్వాములకు ఆటోమేటిక్‌గా జమ చేసే విధానం ఇందులో ఉండనుంది. ఆటో, క్యాబ్ డ్రైవర్లతో పాటు ఇతర రవాణా సేవలందించే వారు కూడా భాగస్వాములుగా చేరి ప్రయాణికులకు నేరుగా సేవలు అందించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆర్టీసీ సొంతంగా ఆటోలను కొనుగోలు చేసి నడపబోతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని యాజమాన్యం ఖండించింది. ప్రస్తుతం కానీ, భవిష్యత్తులో కానీ ఆర్టీసీ సొంతంగా ఆటోలను కొనుగోలు చేసి నిర్వహించే ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది. ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు ఎలాంటి అపోహలకు గురికావద్దని కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!