

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ వితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అగా ఖాన్ ఫౌండేషన్ వారసత్వ సంపద పరిరక్షణ, పునరుద్ధరణలో కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శాసనమండలి భవనం, కుతుబ్‌షాహీ సమాధుల పునరుద్ధరణలో ఫౌండేషన్ సహకారాన్ని ఆయన ప్రస్తావించారు. మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, మూసీ పరివాహక ప్రాంతంలోని సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణకు అగా ఖాన్ ఫౌండేషన్ సహకారం కోరుతున్నట్లు తెలిపారు.
గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి కోసం కొత్త భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనాన్ని వారసత్వ కట్టడంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. మూసీ నదిని హైదరాబాద్ రాత్రి ఆర్థిక కార్యకలాపాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ విని సీఎం ఆహ్వానించారు. వందకు పైగా దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఫ్యూచర్ సిటీని నెట్-జీరో నగరంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో గ్రీన్ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నామని, అమెజాన్ వంటి సంస్థలు ఇప్పటికే అక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించాయని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!