

గురుగ్రామ్‌లో మహిళా బైకర్ సియాను కారుతో ఢీకొట్టి పరారైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో హత్యాయత్నం సెక్షన్‌ను పోలీసులు తాజాగా చేర్చారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు, పోలీసుల తీరుపై సియా, ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై సీనియర్ పోలీసు అధికారి సందీప్ మాలిక్ స్పందిస్తూ.. వీడియోలో సియాను కల్యాణ్ ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో హత్యాయత్నం సెక్షన్‌ను చేర్చినట్లు వెల్లడించారు.
సియా, ఆమె స్నేహితులు గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై స్పోర్ట్స్ బైకులపై వెళ్తుండగా కల్యాణ్ కారులో ఆమెను వెంబడించినట్లు పోలీసులు తెలిపారు. బైక్ ఆపాలని కల్యాణ్ కోరగా, తనను ఎందుకు అనుసరిస్తున్నావని సియా ప్రశ్నించి, కారును తనకు దూరంగా ఉంచాలని కోరినట్లు సమాచారం. కొంత దూరం వెళ్లిన తర్వాత వేగంగా వచ్చిన కారు సియా బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆమె రోడ్డుపై పడిపోయారు. బైక్ కొంత దూరం నిప్పులు చిమ్ముకుంటూ ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. గురుగ్రామ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయగా, అనంతరం సియా కుటుంబ సభ్యులు పోలీసులను కలిసి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై సియా, కల్యాణ్ వాదనలు వేర్వేరుగా ఉన్న నేపథ్యంలో అసలు తప్పెవరిదనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!