

హైదరాబాద్ క్యూర్ పరిధిలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్తో కలిసి పథక బ్రోచర్, మీ సేవ, వాట్సాప్ దరఖాస్తు విధానాన్ని ఆవిష్కరించారు. పేద కుటుంబాలందరికీ సొంత ఇల్లు అందే వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ప్రతి లబ్ధిదారుడికి 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో కూడిన ఇల్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సబ్సిడీ అందించగా, మిగిలిన మొత్తాన్ని నాలుగు విడతల్లో వసూలు చేయనుంది. జూలై 21 నుంచి మీ సేవ కేంద్రాలు, వాట్సాప్ (8096958096), అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉండాలి, క్యూర్ పరిధిలో సొంత ఇల్లు లేదా స్థలం ఉండకూడదు. వచ్చే ఏడాది బోనాల నాటికి కొత్త ఇందిరమ్మ ఇళ్ల నుంచే బోనాలు ఎత్తేలా నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అలాగే త్వరలో మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రత్యేక గృహ పథకాన్ని కూడా తీసుకురానున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!