

రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్ల అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా చర్చించి సమస్యను పరిష్కరించుకోగలరని వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తెలిపారు. ఇరువురు నేతల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ విషయంలో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా పెంచిందని నవారో పేర్కొన్నారు. రష్యా చమురు ఉత్పత్తులను భారత్ విక్రయించడం ద్వారా మాస్కోకు పరోక్షంగా ప్రయోజనం కలుగుతోందని తాను గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. అయితే తన వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్ర విమర్శలు వచ్చాయని, ఇలాంటి స్పందనలు సమస్య పరిష్కారానికి ఉపయోగపడవని అన్నారు.
రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం కల్పించే అమెరికా చట్టం నేపథ్యంలో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా సెనేట్ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. రష్యా ఇంధన కొనుగోళ్ల విషయంలో భారత్ తన ఇంధన భద్రత అవసరాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటోందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మోదీ, ట్రంప్ మధ్య చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని నవారో విశ్వాసం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!