

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్ వరల్డ్ చిత్రం ‘స్పిరిట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హీరోయిన్ ఎంపిక సమయంలో దీపికా పదుకొణెను తొలుత కథానాయికగా ఎంపిక చేసినప్పటికీ, ఆ తర్వాత ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రిని తీసుకున్నారు. దీపికాను ప్రాజెక్ట్ నుంచి తప్పించడానికి ఆమె డిమాండ్లే కారణమనే ప్రచారం జరిగింది. తాజాగా చిత్ర నిర్మాత, సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా దీనిపై స్పందిస్తూ.. హీరోయిన్ పాత్ర కోసం దాదాపు 18 నెలల పాటు దీపికాతో చర్చలు జరిపామని తెలిపారు. ఆమె ప్రతిభపై నమ్మకంతోనే ముందుగా సంప్రదించినట్లు చెప్పారు.
అయితే దీపికా భారీ పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో 10 శాతం వాటాను కోరినట్లు ప్రణయ్ రెడ్డి వంగా ఆరోపించారు. అలాగే డేట్స్, షూటింగ్ సమయాలకు సంబంధించి కొన్ని షరతులు పెట్టారని, అవి తమ నిర్మాణ విధానానికి సరిపోకపోవడంతో ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా, తమ మధ్య జరిగిన ప్రైవేట్ చర్చల వివరాలు ఆమె పీఆర్ బృందం ద్వారా బయటకు వచ్చాయని కూడా ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలు నిర్మాత వంగా చేసిన ఆరోపణలుగా మాత్రమే చూడాలి. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!