

హైదరాబాద్‌లో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నిహారికకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య ఆలయ చరిత్రతో పాటు బోనాల ఉత్సవాల విశిష్టత, సంప్రదాయాలను ఆమెకు వివరించారు.
ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. ప్రధాన బోనాల రోజు షూటింగ్ ఉండటంతో ఆలయానికి రాలేకపోయానని, అందుకే అమ్మవారి దర్శనం కోసం వచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన తనకు బోనాల సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని వెళ్లే దృశ్యాలు ఎప్పుడూ ఎంతో ఆకట్టుకునేవని చెప్పారు. కొద్ది రోజుల క్రితం సరదాగా తాను కూడా బోనాలకు వెళ్లాలని కోరుకున్నానని, ఆ కోరిక ఇంత త్వరగా నెరవేరడం అమ్మవారి అనుగ్రహమేనని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా అనిపించిందని, మరోసారి కూడా ఆలయానికి వచ్చే అవకాశం కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిహారిక ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!