

మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె కుటుంబం బీజేపీలో చేరతారన్న ఊహాగానాలపై కమల నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. సురేఖను కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి తొలగించిన సమయంలో బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, ఇప్పుడు కొండా కుటుంబం పార్టీలోకి వస్తే ఎంతవరకు ప్రయోజనం ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కొండా మురళి, సురేఖ, సుస్మిత బీజేపీలో చేరితే పార్టీకి కలిగే లాభనష్టాలు, వారు ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారనే అంశాలపై నేతల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
కొండా కుటుంబం జనసేన వైపు కూడా వెళ్లే అవకాశాలపై ప్రచారం సాగుతోంది. ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురేఖ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఎదురుపడి మర్యాదపూర్వకంగా పలకరించుకోవడం, అనంతరం కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చేరికపై ఊహాగానాలను పెంచాయి. అయితే బీజేపీ ముఖ్య నేతలు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని సంకేతాలు ఇస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా కొనసాగుతానని, కాంగ్రెస్‌కు రాజీనామా చేయబోనని సురేఖ స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు తమ పార్టీ సభ్యత్వంతో పాటు పదవులకు రాజీనామా చేయాలన్న జాతీయ నాయకత్వ నిబంధన ఆమె చేరికకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. సురేఖ పదవీకాలం ఇంకా రెండేళ్లకు పైగా ఉండటంతో రాజీనామాపై ఆమె ఆసక్తి చూపకపోవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబం ఆసక్తి చూపుతున్న స్థానాల్లో బీజేపీకి ఇప్పటికే బలమైన నేతలు ఉండటంతో అంతర్గత పోటీపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!