

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించారు. ఆయనకు ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, ట్రస్టు సభ్యులు నారా బ్రాహ్మణి, జె.ఎస్.ఆర్ ప్రసాద్‌లు ఘన స్వాగతం పలికారు. అనంతరం నందమూరి బసవతారకం, నందమూరి రామారావు విగ్రహాలకు సంజయ్ దత్ నివాళులర్పించారు. ఆసుపత్రిలోని పీఈటీ సీటీ, రేడియేషన్, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్, చిన్నారుల వార్డులను సందర్శించి వైద్యులతో, రోగులతో మాట్లాడారు. చిన్నారులకు బహుమతులు, పండ్లు పంపిణీ చేశారు.
ప్రత్యేక కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ సంజయ్ దత్‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. క్యాన్సర్ చికిత్సలో ఆసుపత్రి అందిస్తున్న ఆధునిక సేవలను బాలకృష్ణ వివరించారు. ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలతో ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను జయించిన సంజయ్ దత్ మాట్లాడుతూ క్యాన్సర్‌పై భయపడాల్సిన అవసరం లేదని, వ్యాధిని తొలిదశలో గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని సూచించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలను ఆయన ప్రశంసించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!