

ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 తెలుగు ప్రేక్షకుల కోసం భారీ కంటెంట్ లైనప్‌ను ప్రకటించింది. కొత్త ఒరిజినల్స్, భారీ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు, వినోద కార్యక్రమాలు, ఏఐ ఆధారిత కథనాలు, లైవ్ స్పోర్ట్స్‌తో రూపొందించిన ఈ లైనప్ ద్వారా తెలుగు ఓటీటీ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని జీ5 లక్ష్యంగా పెట్టుకుంది. వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్, షైన్ స్క్రీన్స్, వృద్ధి సినిమాస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలతో జీ5 భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. నందమూరి బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఎన్‌బీకే111’, నాగచైతన్య–కార్తీక్ వర్మ దండు చిత్రం ‘వృషకర్మ’, ‘జనవరి 12 విడుదల’, ‘లెనిన్’, ‘కనకదుర్గ’ వంటి సినిమాలు ఈ లైనప్‌లో ఉన్నాయి. వీటితో పాటు ‘జననాయకుడు’, ‘హాయ్’, ‘డిమాంటీ కాలనీ 2’, ‘ఏ క్వీన్’, ‘వీరప్పన్ 2’ వంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి.
సినిమాలతో పాటు ఒరిజినల్ కంటెంట్‌పైనా జీ5 ప్రత్యేక దృష్టి పెట్టింది. నివేదా థామస్ ప్రధాన పాత్రలో ‘శ్రీమతి’, భరత్ నివాస్, శివాజీ రాజా కీలక పాత్రల్లో క్రైమ్ థ్రిల్లర్ ‘పంచనామా’ రానున్నాయి. గతంలో ప్రేక్షకాదరణ పొందిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమం జగపతి బాబు హోస్ట్‌గా ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ పేరుతో తిరిగి రానుంది. మరోవైపు ‘గరుడ’, ‘విక్రమ్ బేతాళ్’, ‘శివ్ సతి’, ‘చంద్రకాంత’, ‘తిరుపతి బాలాజీ’, ‘నర్మద’, ‘రామ్ ఆంజనేయ యుద్ధ్’ వంటి ఏఐ ఆధారిత కథనాలను కూడా అందించనుంది. పిల్లల కోసం ప్రత్యేక కంటెంట్‌తో పాటు FIFA, బుండెస్‌లీగా, కోపా ఇటాలియా, ILT20 వంటి లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్లను అందిస్తూ జీ5 తన కంటెంట్ పరిధిని మరింత విస్తరిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!