

రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లకుండా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేయడంపై రాంచందర్‌రావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని, విద్యాసంస్థలకు చెందిన విలువైన భూములను రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. జీవో 97 పేరుతో పాలిటెక్నిక్ కళాశాలలను మూసివేసి, వాటి విలువైన భూములను స్వాధీనం చేసుకునే కుట్ర జరుగుతోందని విమర్శించారు.
యూనివర్సిటీలకు రూ.1,000 కోట్ల నిధులు ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోవడం లేదని రాంచందర్‌రావు ఆరోపించారు. ఉపాధ్యాయులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. తెలంగాణలో విద్యావ్యవస్థ పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని, పీడీ యాక్టులు పెట్టినా, జైలుకు పంపినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో పర్యటనలు, రాజకీయ కార్యక్రమాలపై దృష్టి పెట్టే బదులు తెలంగాణకు వచ్చి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పనితీరును పరిశీలించాలని రాహుల్‌గాంధీకి సవాల్ విసిరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!