

మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పరకాల నియోజకవర్గంలో తన తల్లి జన్మదిన వేడుకల సందర్భంగా మాట్లాడిన ఆమె. పరకాల కొండా దంపతుల ఇలాకా అని, రాబోయే రోజుల్లో తానే ఎమ్మెల్యేగా కొనసాగుతానని అన్నారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పరకాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే సమయంలో కొండా దంపతులు ఆయనకు మద్దతుగా నిలిచారని సుష్మితా పేర్కొన్నారు. కొండా మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, అయితే ఆ హామీ నెరవేరలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని తాను చెప్పలేదని రేవంత్ రెడ్డి భావిస్తే, ప్రమాణం చేసి చెప్పాలని ఆమె సవాల్ చేశారు.
రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై తమ వద్ద అనేక ఆరోపణలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని సుష్మితా పటేల్ అన్నారు. వాటిని ఒక్కొక్కటిగా బయటపెడతానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, బీసీలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వంపై తనకు గౌరవం ఉందని, అయితే వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా రేవంత్ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
పరకాల టికెట్‌ను రేవూరి ప్రకాశ్ రెడ్డికి ఎలా ఇస్తారని ప్రశ్నించిన సుష్మితా...రేవంత్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డికి సవాల్ విసిరారు. వెంటనే రాజీనామా చేసి పరకాలలో ఉప ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాను లేదా రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎవరు బలమైన నాయకుడో ఎన్నికల్లో తేల్చుకుందామని అన్నారు. కాంగ్రెస్ టికెట్ రాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతంత్రంగా పోటీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!