

దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో తమిళనాడు టీవీకే చీఫ్ విజయ్ రూపాన్ని ప్రతిబింబించేలా కొన్ని వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. ఈ విగ్రహాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. లక్షలాది మంది పూజించే దైవస్వరూపాన్ని రాజకీయ నాయకుడి రూపంలోకి మార్చి రాజకీయ ప్రచారానికి ఉపయోగించడం సరికాదని భాజపా తమిళనాడు అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ విమర్శించారు.
మతపరమైన వేడుకలను టీవీకే కార్యకర్తలు రాజకీయ ప్రచార సాధనాలుగా ఉపయోగిస్తున్నప్పటికీ విజయ్ మౌనంగా ఉండటాన్ని నయినార్ నాగేంద్రన్ ప్రశ్నించారు. వెంటనే విగ్రహాలను తొలగించడంతో పాటు నిర్వాహకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదంపై టీవీకే వర్గాలు స్పందిస్తూ.. సంబంధిత వ్యక్తులను ఇప్పటికే విగ్రహాలను తొలగించాలని ఆదేశించినట్లు వెల్లడించాయి. విజయ్ అభిమానులు గత ఎనిమిదేళ్లుగా ఇదే తరహాలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!