

ఆసియా క్రీడల కోసం జపాన్‌లోని నాగోయాకు చేరుకున్న భారత బృందానికి ఆరంభంలోనే వసతి, చెక్‌ఇన్ వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, ఆమె కోచ్ అశోక్ మిశ్రాకు క్రూయిజ్ షిప్‌లో ఒకే గదిని కేటాయించడంతో గందరగోళం నెలకొంది. అథ్లెట్, సహాయక సిబ్బందికి ఒకే గది కేటాయించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో భారత బృందం అధికారులు స్థానిక నిర్వాహకులను సంప్రదించారు. భారత ఒలింపిక్ సంఘం జోక్యంతో అర్ధరాత్రి తర్వాత ప్రణతికి, అశోక్ మిశ్రాకు ప్రత్యేక వసతి ఏర్పాటు చేసినట్లు నివేదికలు తెలిపాయి.
అయితే ప్రత్యేక గది కేటాయించిన తర్వాత కూడా అశోక్ మిశ్రాకు మరో సమస్య ఎదురైంది. ఆయన పేరులోని ‘I’ అక్షరం అధికారిక రికార్డుల్లో లేకపోవడంతో హోటల్ రిజిస్టర్‌లో బుకింగ్ కనిపించలేదు. దీంతో అక్రిడిటేషన్, బుకింగ్ వివరాలను మరోసారి పరిశీలించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియకు సుమారు 45 నిమిషాలు పట్టడంతో రాత్రి రెండు గంటల తర్వాతే గది తాళాలు అందినట్లు సమాచారం. ప్రణతి నాయక్ కూడా వసతి విషయంలో గందరగోళం చోటుచేసుకున్న విషయాన్ని ధృవీకరించారు. భారత బృందంలోని మరికొందరు క్రీడాకారులు కూడా గదుల కేటాయింపు, చెక్‌ఇన్, రవాణా, శిక్షణకు సంబంధించిన ఏర్పాట్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!