

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న మహేశ్ కుమార్ గౌడ్ తన ప్రయాణంపై సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించానని, చిన్న లోపం లేకుండా పార్టీని ముందుకు నడిపేందుకు ప్రయత్నించానని తెలిపారు. దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి తనకు అన్ని విధాలా సహకరించారని చెప్పారు. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేశామని, గాంధీ భవన్ కనెక్ట్ సెంటర్ ద్వారా ప్రతి బూత్ నుంచి పది మంది కార్యకర్తలను అనుసంధానించి పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నామని వివరించారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం, ‘జనహిత’ పాదయాత్ర, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయాలు పార్టీ బలోపేతంలో కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు.
తనకు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమన్నారు. డీలిమిటేషన్ అనంతరం తెలంగాణ నుంచి 14–15 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేకపోవడం బాధగా ఉందని, ఈ నెలాఖరులోపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం జరుగుతుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షుల నిర్ణయాలు భవిష్యత్ ఎన్నికల్లో కీలకమవుతాయని, వచ్చే ఎన్నికల్లో తన సొంత జిల్లా నుంచి తప్పకుండా పోటీ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం బీసీ సీఎం నినాదానికి తావు లేదని, సీఎం రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!