

కొంతమందిని చరిత్ర ఎప్పటికీ క్షమించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభలో మాట్లాడుతూ.. గతంలో జరిగిన తప్పులపై సభలో చర్చ జరుగుతుందనే ఉద్దేశంతోనే ప్రధాన ప్రతిపక్షం సభ మొదటి రోజే కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. ప్రభుత్వ భూముల అంశాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, కరవు, కొందరు చేసిన క్షుద్ర పూజల వంటి అంశాలు చర్చకు వస్తాయనే భయంతోనే ఇలా వ్యవహరించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఆడబిడ్డ సమానమేనని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
సభాపతిని గౌరవించడం సభ్యుల సంప్రదాయమని, సభలో ప్రతి సభ్యుడి హక్కులను కాపాడే బాధ్యత సభాపతిదేనని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వమే శాసనసభ నిర్వహణకు సంబంధించిన కొన్ని నిబంధనలు రూపొందించిందని, వాటి ప్రకారమే సభాపతి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. గేట్-3 వద్ద పోలీసులు ఆ ఆదేశాలను అమలు చేశారని చెప్పారు. నినాదాలు ఉన్న టీషర్టులతో సభలోకి రావొద్దని స్పీకర్ ఆదేశిస్తే సభ్యులు వాటిని పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ నల్ల టీషర్టు ధరించి వెళ్లిన అంశాన్ని ప్రతిపక్ష నేతలు ప్రస్తావిస్తున్నారని, అక్కడ అలాంటి నిబంధనలు లేవని అన్నారు. పోలీసులను దూషించడం, అర్ధనగ్న ప్రదర్శనకు దిగడం, సభాపతిని దూషించడం వంటి చర్యలకు పాల్పడినందుకే బీఆర్‌ఎస్ సభ్యులపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!