

తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) పూర్తి చేసుకున్న లలితా జువెలరీ మార్ట్ లిమిటెడ్ వ్యాపార విస్తరణపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని సంస్థ సీఎండీ ఎం. కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో రిటెయిల్ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో 64 షోరూమ్‌లు ఉన్నాయని, అదనంగా 110 కేంద్రాలను ప్రారంభించడమే లక్ష్యమని చెప్పారు. 2027 మార్చి నాటికి కనీసం 10 కొత్త స్టోర్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 175 షోరూమ్‌లకు చేరుకున్న తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, దిల్లీ మార్కెట్లలోకి విస్తరించనున్నట్లు వివరించారు.
అంతర్జాతీయ విస్తరణలో భాగంగా వచ్చే 2–3 నెలల్లో మలేషియాలో షోరూమ్ ప్రారంభించనున్నామని, అనంతరం సింగపూర్‌లో అడుగుపెడతామని కిరణ్ కుమార్ తెలిపారు. తక్కువ లాభంతో అధిక విక్రయాలు సాధించడమే తమ ప్రధాన వ్యూహమని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 58 షోరూమ్‌ల ద్వారా రూ.25,000 కోట్ల మొత్తం ఆదాయం, రూ.1,000 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపైనే దృష్టి సారిస్తున్నామని, 9 లేదా 14 క్యారెట్ల బంగారం విక్రయించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తమ వినియోగదారుల్లో సుమారు 60 శాతం మంది పాత బంగారాన్ని మార్పిడి చేసుకుంటున్నారని తెలిపారు. బంగారం ధర దీర్ఘకాలంలో పెరుగుతూనే ఉంటుందని, అందువల్ల పసిడిని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పరిగణించవచ్చని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!