

ఐటీ రంగంలో మానవ ఉద్యోగాలను కృత్రిమ మేధ భర్తీ చేస్తుందనే భయాలు ప్రజల్లో టెక్నాలజీపై విశ్వాసాన్ని తగ్గిస్తున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఈ విశ్వాసాన్ని తిరిగి పెంచేందుకు టెక్నాలజీ సంస్థలు తమ పెట్టుబడులతో స్థానిక ప్రజలకు కలిగే ప్రయోజనాలను స్పష్టంగా వివరించాలని సూచించారు. ఉదాహరణకు ఒక సంస్థ డేటా సెంటర్‌ను నిర్మిస్తే, దానివల్ల స్థానిక సమాజానికి కలిగే ఉపయోగాలను తెలియజేయాలని చెప్పారు. ప్రస్తుతం ఉత్పాదకతను పెంచడానికే కాకుండా అనేక ఇతర అవసరాలకు కూడా ఏఐ వినియోగం విస్తరిస్తోందని, అందువల్ల రాబోయే ఏఐ యుగం గత సాంకేతిక పరివర్తనలకు భిన్నంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తులో విజయవంతమయ్యే సంస్థలు మానవుల పరిజ్ఞానం, సృజనాత్మకతను ఏఐ సామర్థ్యాలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఏఐని మానవులకు ప్రత్యామ్నాయంగా పనిచేసే స్వతంత్ర మేధస్సుగా కాకుండా, వారి ఆలోచనా సామర్థ్యాన్ని పెంచి లక్ష్యాలను సాధించడంలో సహాయపడే సాధనంగా చూడాలని సూచించారు. ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో ఏఐని తీసుకురావడం కాకుండా, ఉద్యోగుల నైపుణ్యాలు, సామర్థ్యాలను మరింత పెంచేందుకు దాన్ని ఉపయోగించాలని కంపెనీలకు పిలుపునిచ్చారు. కొత్త ఉద్యోగాల సృష్టి, మెరుగైన వేతనాలు, విస్తృత ఆర్థిక అవకాశాలకు కూడా ఏఐ దోహదపడేలా చూడాలని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!