

జపాన్‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఫుజిత్సు, అమెరికాకు చెందిన ఏఐ దిగ్గజం ఎన్విడియా సాంకేతికతను ఉపయోగించి ఫిజికల్ ఏఐ రంగంలో కీలక అడుగులు వేస్తోంది. కేవలం ప్రోగ్రామ్ చేసిన ఆదేశాలను అమలు చేసే రోబోలకే పరిమితం కాకుండా, స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్మార్ట్ రోబోలను అభివృద్ధి చేయడమే ఈ భాగస్వామ్య లక్ష్యం. ఈ రోబోలు పరిశ్రమలు, ఆస్పత్రులు, గృహాల్లో సురక్షితంగా పనిచేసేలా రూపుదిద్దుకోనున్నాయి. టోక్యోలో జరిగిన సమావేశంలో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఫుజిత్సు సీఈఓ తకాహితో టోకిటా, ఫానుక్, యాస్కావా ఎలక్ట్రిక్, కవాసకి హెవీ ఇండస్ట్రీస్ సంస్థల ప్రతినిధులు ఈ ప్రణాళికను ప్రకటించారు.
జపాన్‌లో తీవ్రంగా ఉన్న కార్మికుల కొరతను అధిగమించడంలో ఫిజికల్ ఏఐ రోబోలు కీలక పాత్ర పోషిస్తాయని సంస్థల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒంటరిగా నివసించే వృద్ధుల సంరక్షణలో ఈ స్మార్ట్ రోబోలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. స్వయంచాలకంగా పనిచేసే రోబోల భద్రత అత్యంత కీలకమని పేర్కొన్న జెన్సన్ హువాంగ్, అత్యున్నత తయారీ నాణ్యతలో జపాన్‌కు ఉన్న ఖ్యాతి ఈ రంగంలో దేశాన్ని ముందంజలో నిలబెడుతుందని అన్నారు. 2040 నాటికి ఫిజికల్ ఏఐ, సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు తదితర సాంకేతిక రంగాల్లో 370 ట్రిలియన్ యెన్లకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను సమీకరించాలని జపాన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!