

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో పాటు ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో శుక్రవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సౌదీ అరేబియా, హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు ముదరడం మదుపర్లలో ఆందోళన పెంచింది. చమురు ధరలు పెరగడం ద్రవ్యోల్బణంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు పతనమైంది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 622 పాయింట్లు కోల్పోయి 74,268 వద్ద, నిఫ్టీ 221 పాయింట్లు తగ్గి 23,256 వద్ద కొనసాగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.79గా నమోదైంది. నిఫ్టీలో ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో ఉండగా.. హిందాల్కో, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
మరోవైపు ముడిచమురు ధరలు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సౌదీ-హూతీ ఘర్షణలు మరింత ముదరడం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రభావం చూపింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 108.77 డాలర్లకు చేరి నాలుగు నెలల గరిష్ఠాన్ని తాకింది. ఒక్క వారంలోనే బ్రెంట్ ధర 12 శాతానికి పైగా పెరిగింది. చమురు ధరల పెరుగుదలతో భారత్ దిగుమతి బిల్లు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ, కంపెనీల లాభదాయకతపై ఒత్తిడి పెరిగే అవకాశముంది. గురువారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియగా.. శుక్రవారం ఆసియా మార్కెట్లలోనూ ప్రతికూల ధోరణి కొనసాగడం దేశీయ మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!